Okka Kshanam Movie Review - Rating 3.5 / 5


Dec 28 2017 8:02 PM
Okka Kshanam

Okka Kshanam Review & Rating

నటీనటులు : అల్లు శిరీష్, సురభి, శ్రీనివాస్ అవసరాల, సీర‌త్ క‌పూర్‌
దర్శకత్వం : విఐ ఆనంద్
నిర్మాత : చక్రి చిగురుపాటి
సంగీతం : మణిశర్మ
సినిమాటోగ్రఫర్ : శ్యామ్ కె. నాయిడు
ఎడిటర్ : ఛోటా కె. ప్రసాద్
విడుదల తేదీ : డిసెంబర్ 28, 2017

అల్లు శిరీష్ హీరోగా, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ ఫేమ్ విఐ. ఆనంద్ డైరెక్ట్ చేసిన ‘ఒక్క క్షణం’ మంచి పాజిటివ్ బజ్ తో ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ:
ఈ కథ ఒక షాపింగ్ మాల్ సెల్లార్ లో కార్ పార్కింగ్ ప్రదేశంలో మొదలవుతుంది. ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడని కుర్రాడు జీవా (అల్లు శిరీష్) తన పాత ఫియెట్ కారులో అమ్మానాన్నలతో షాపింగ్ బోర్ అని, కారులోనే కూర్చుంటాడు. అక్కడ పక్క కారులో జ్యోత్న్స (సురభి) కాలికి గాయం వల్ల కదల్లేక తనూ కారులోనే కూర్చుని ఉంటుంది. ఇద్దరికీ చూపులు కలుస్తాయి. ఫోన్ నెంబర్లు తెలుస్తాయి. వాళ్లిద్దరి మధ్య పరిచయం పెరుగుతుంది. ప్రేమ చిగురిస్తుంది. అయితే, సురభి ఉంటున్న అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో, ఎదురు ఫ్లాట్స్ లో ఉంటారు శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్), స్వాతి (శీరత్ కపూర్) జంట. ఎప్పుడూ గొడవ పడుతుంటారు. కొన్నిసార్లు శ్రీనివాస్, స్వాతి మధ్య గొడవ జరిగి ఆమెని కొట్టడం కూడా చూస్తారు జీవా, జ్యోత్న్స. శ్రీనివాస్ ఒక సైకో అని, అతని వల్ల స్వాతికి ప్రమాదం ఉందని అనుకుంటారు. పోలీసులకు సమాచారం ఇవ్వాలంటుంది జ్యోత్న్స. వద్దని వారించి, వాళ్ల విషయం కనుక్కుంటాలే అని భరోసా ఇస్తాడు జీవా. శ్రీనివాస్ తో పరిచయం పెంచుకుని ఆ జంట కథ తెలుసుకుని షాక్ అవుతాడు జీవా. ఎందుకంటే, శ్రీనివాస్, స్వాతీల లవ్ స్టోరీ కూడా సరిగ్గా సెల్లార్ పార్కింగ్ లోనే జరగడం, వాళ్లిద్దరి లవ్ స్టోరీలూ సరిగ్గా ఒకేలా జరుగుతుండటంతో ఆశ్చర్యపోతారు ఇద్దరూ. అంటే, భవిష్యత్తులో కూడా తన పరిస్థితి స్వాతిలాగే అవుతుందేమో, జీవా కూడా శ్రీనివాస్ లాగ సైకో అవుతాడా, తన జీవితం కూడా స్వాతిలాగే అవస్థల పాలవుతుందా? అని భయపడిపోతుది జ్యోత్న్స. ఈ క్రమంలో స్వాతి మరణిస్తుంది. ఆమెని చంపిన నేరానికి జైలు పాలవుతాడు శ్రీనివాస్. ఈ ఘటనతో ఇంకా బెదిరిపోయిన జ్యోత్స్న, జీవాని దూరం చేసుకుంటుంది. ఒక వైపు ప్రేమ, మరొక వైపు డెస్టినీ... ఈ రెండు అంశాల మధ్య నలిగిపోయే ప్రేమికుడు జీవా తన ప్రేమ సమస్యని ఎలా పరిష్కరించుకున్నాడు? విధి వాళ్లిద్దరి జీవితాలతో ఎలా ఆడుకుంది? ప్రేమ గెలుస్తుందా, డెస్టినీ గెలుస్తుందా? జీవా చేతిలో జ్యోత్న్స మరణిస్తుందా? ఈ ఆసక్తికరమైన ప్రశ్నలతో కథ సాగి క్షణక్షణం ఉత్కంఠని రేకెత్తిస్తుంది.

విశ్లేషణ:
ప్యారలల్ లైఫ్ ఈ కాన్సెప్ట్ తెలుగుకి కొత్తదనే చెప్పాలి. ఒకరి జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయో అలాంటి పరిస్థితులే మరొక వ్యక్తికి కూడా ఎదురైతే ఎలా ఉంటుందనేదే ఈ కథ. ఒకట్రెండు సార్లు జరిగితే అది యాదృచ్చికమని అనుకోవచ్చు. కానీ ప్రతి విషయం కూడా అలానే జరుగుతుంటే.. అదే తలరాత. దాన్ని ఎవరు మార్చలేరు. ఈ కథలో హీరో మాత్రం తను ప్రేమించిన అమ్మాయి కోసం ఆ విధితోనే పోరాడతాడు. తన ప్రేమను, ప్రేమించిన అమ్మాయిని గెలుచుకుంటాడు. సినిమా మొత్తం కూడా దర్శకుడు చాలా ఎంగేజింగ్‌గా తెరకెక్కించారు.
ఫస్ట్ హాఫ్ పూర్తయ్యేసరికి సినిమాపై ఆసక్తి పెరిగిపోతుంది. సెకండ్ హాఫ్‌లో కాస్త ల్యాగ్ ఉన్నప్పటికీ తరువాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. పతాక సన్నివేశాల్లో జోరు పెంచితే మరింత బాగుండేది. అతి తక్కువ క్యారెక్టర్లతో దర్శకుడు కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. నలుగురి జీవితాలను, ఒక యాక్సిడెంట్‌కు ముడిపెట్టిన తీరు అభినందనీయం. అల్లు శిరీష్ తన నటనలో బాగా ఇంప్రూవ్ అయ్యాడు. ఎమోషనల్, లవ్ ఇలా ప్రతి సన్నివేశానికి తన నటనతో న్యాయం చేశారు. సురభి, సీరత్ కపూర్ గ్లామరస్‌గా కనిపించారు. సీరత్ కపూర్ పాత్ర ఆడియన్స్‌ను మెప్పిస్తుంది. అవసరాల శ్రీనివాస్ తన పాత్రలో ఇమిడిపోయాడు. సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించిన దాసరి అరుణ్ కుమార్‌కు ఈ సినిమాతో మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. ఆయన వాయిస్ గంభీరంగా విలన్ పాత్రకు సరిపడేలా ఉంది.
టెక్నికల్‌గా సినిమాను క్వాలిటీతో తెరకెక్కించారు. కథ మొత్తం ఒక అపార్ట్మెంట్ లోనే చిత్రీకరించినా.. ఎక్కడా బోర్ అని అనిపించదు. ఉన్న లొకేషన్స్‌ను అందంగా చూపించారు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకుండా ఈ సినిమాను ఊహించలేము. అంత అద్భుతమైన నేపధ్య సంగీతాన్ని అందించారు. పాటలు కూడా బాగున్నాయి. ఎడిటింగ్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. డిఫరెంట్ సినిమాలను కోరుకునే ప్రేక్షకులకు 'ఒక్క క్షణం' సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీకెండ్ లో మంచి టైమ్ పాస్ ఈ 'ఒక్క క్షణం'.

రేటింగ్: 3.5


Tags: Okka Kshanam Telugu Movie Review , Allu Sirish Okka Kshanam Telugu Movie Review , Okka Kshanam Movie Review , Okka Kshanam Review and Rating , Okka Kshanam telugu